Sunday, February 16, 2014

కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఛీ కొడుతున్నారు

లోక్‌సభలో గురువారం జరిగిన సంఘటనతో కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా ఛీ కొడుతున్నారు. గురువారం సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేశారు. సోమవారం సీమాంధ్ర మంత్రులను గెంటేస్తారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి రాజగోపాల్, వేణుగోపాల్‌రెడ్డిపై పిడిగుద్దులు గుద్దారు. రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడకుంటే తెలంగాణ బిల్లు గురువారమే పాస్ అయి ఉండేది. కేంద్రానికి దమ్ముంటే లోక్‌సభలో సిసి కెమెరాల ఫుటేజిలు బయటపెట్టాలి. అప్పుడు వాస్తవాలు వెలుగుచూస్తాయి. కాంగ్రెస్‌లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’ అని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాయలసీమలో కాంగ్రెస్‌కు కొండంత అండగా నిలిచిన కోట్ల తొలిసారి సొంత పార్టీపై ఘాటుగా విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. శుక్రవారం కర్నూలులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో పలు వివాదాస్పద బిల్లులను తప్పుబట్టిన రాహుల్ గాంధీ టి. బిల్లుపై నోరు మెదపకపోవడం రాజకీయమంటూ నిప్పులు చెరిగారు. సోనియాకు తెలియకుండా ఇదంతా జరిగిందనుకోవడానికి వీలులేదన్నారు. ప్రభుత్వం తీరును తప్పుబడుతూ మంత్రివర్గ సహచరులే వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలపడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. కేంద్ర మంత్రివర్గంలోని సీమాంధ్ర మంత్రులను సోమవారం సభ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు న్నాయని వెల్లడించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి సీమాంధ్ర ఎంపీలపై భౌతికదాడులు చేయించారని మండిపడ్డారు. తెలంగాణకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల ఎంపీలతో పిడిగుద్దులు గుద్దించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేకే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వినియోగించారన్నారు. రాజగోపాల్ పెప్పర్ స్ప్రే వాడి గందరగోళం సృష్టించకపోయి ఉంటే తెలంగాణ బిల్లు గురువారమే పాస్ అయి ఉండేదని కోట్ల స్పష్టం చేశారు.
రాజ్యాంగ విరుద్ధంగా బిల్లు కాపీలు కూడా లేకుండా హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నోటి మాట ద్వారా లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొనడం ఏంటని కోట్ల ప్రశ్నించారు. బిల్లుకు ఎంతమంది మద్దతు ఉందో తెలుసుకోవాలన్న నిబంధన ఉండగా దాన్ని కాదని స్పీకర్ మీరాకుమార్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారని మండిపడ్డారు. తెలుగుదేశం ఎంపి వేణుగోపాల్ కత్తి తీసుకువచ్చారని కమల్‌నాథ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోట్ల అన్నారు. సభలో గందరగోళం జరిగి అంతా బయటకు వచ్చిన తరువాత మేధావిగా చెప్పుకునే తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి చేసిన వాఖ్యలు బెదిరించేవిగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులపై బాంబులు వేస్తే తప్ప అడ్డు తప్పుకోరంటూ జైపాల్ హెచ్చరించడం విచారకరమన్నారు.
బిల్లు విషయంలో కాంగ్రెస్, బిజెపి కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడిందే కానీ సొంత మంత్రుల మాట వినడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని మండిపడ్డారు. కెసిఆర్‌ను నమ్ముకున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిండా మునిగిపోయిందని అన్నారు. సభలో జరిగిన వాస్తవాలను బయటకు వచ్చి చెప్పకుండా జగన్ వౌనం దాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఉన్న నాయకులు, కార్యకర్తలు నేడు ఆ పార్టీ అంటేనే అసహ్యించుకునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. లోక్‌సభలో కాంగ్రెస్ వ్యూహానికి ప్రతి వ్యూహం రచించి బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడమే తమ తదుపరి కర్తవ్యమని కోట్ల స్పష్టం చేశారు

No comments:

Post a Comment