Wednesday, February 12, 2014

భద్రతాదళాల వలయంలో పార్లమెంటు!

పకడ్బందీ వ్యూహం అమలుకు అర్థ రాత్రి దాకా ఏర్పాట్లు!

రాష్ట్ర విచ్చిత్తి బిల్లును ఆరునూరైనా పార్లమెంటులో పెట్టాలని మంకుపట్టుతో ఉన్న సోనియా ఒక శత్రు సమాజంపై యుద్ధ తయారీ చేస్తున్న రీతిలో వ్యవహరిస్తోంది! అడ్డగోలుగా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ఆన్ని రకాల ప్రజాస్వామిక పద్ధతులనూ తోసిరాజనే విధంగా బిల్లును గెలిపించుకొవాలని నానారకాల కుయుక్తులతో అణచివేతకు, దమనకాండకు దారుణమైన ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటును అష్ట దిగ్బంధనం చేస్తోంది!

సమైక్య వాద ఎంపీలు, మంత్రులు తన నిరంకుశత్వాన్ని ధిక్కరించడాన్ని, తిరుగు బాటు చేయడాన్ని ఏమాత్రం సహించలేక పోతోంది! ఉక్రోషంతో రెచ్చి పోతోంది! రేపేదైనా మహోపద్రవం జరగబోతోందా అన్నట్లుగా అగ్నిమాపక దళాలు, అనేక పటాలాల మార్షల్స్, అంబులెన్సులు, డాగ్ స్క్వాడ్స్, చివరికి పాములు పట్టే వాళ్ళను కూడా సిద్ధం చేసి ఉంచినట్లు తెలుస్తోంది! తాళ్ళు, దుప్పట్లు, నిచ్చెనలు, ఇంకా నానారకాల సరంజామా సిద్ధం చేసారట! తీవ్రవాదులెవరో పార్లమెంటుపై ముట్టడి చేస్తున్నారా అన్నట్లుగా పారా హుషార్ ప్రకటించారు! ఈ దేశం తన సామ్రాజ్యమని, పార్లమెంటు ఆమె రాణీవాసం అనీ ఆమె తలపోస్తున్నట్లున్నది!

ఎందుకీ యుద్ధ తయారీ! ఎవరిపై ఈ కక్ష! ఎవరికీ ఎవరు శత్రువులు! ఎందుకింత దుర్భేద్యమైన అసాధారణ ఏర్పాట్లు? తెలుగు సమాజంపై సోనియా చూపిస్తున్న ఈ దారుణ వివక్ష కోట్లాది ప్రజల గుండెలను శూలాలతో పొడిచినట్లుగానే ఉంది! అందలాలెక్కించిన వారినే క్రూరమైన విద్వేషంతో కుళ్ళబొడిచేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ దుస్సాహసానికి ఆమె ఎందుకు ఒడిగడుతోంది?! దేశం కానీ దేశం నుంచి వచ్చినా - పెద్ద మనసుతో ఆదరించి పదవినిచ్చి అధికారంలో కూర్చోపెట్టిన వారిపైనే ఇంత అహంకారపూరితమైన అధికార మదోన్మాదంతో ఎందుకు విరుచుకు పడుతోంది?

రాష్ట్ర విచ్చిత్తి బిల్లుకు రాజ్యాంగ బద్ధత లేదు! దానికి యావత్తూ ప్రజల మద్దతు లేదు! ఆ బిల్లులో అనేక రాజ్యాంగపరమైన లొసుగులు, లోపాలూ ఉన్నాయి! అది ఏకపక్షమైన వివక్షా భరితమైన అన్యాయపు బిల్లు! అందరి ప్రజల ఆలోచనలను పంచుకోని బిల్లు! ఈ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు! అయినా దానిని ఎందుకామె పాశవిక పద్ధతులలో బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తోంది! అందుకోసం రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా మార్చేసి, చట్టాలను చాపచుట్టి అటకెక్కించి తన ఇష్టా రాజ్యంగా ఈ వికృత బిల్లును చెల్లుబాటు చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తోంది?

ఇట్లాంటి భయంకరమైన, కుట్ర పూరితమైన దురాగతాలకు పాల్పడిన వాళ్ళకు చివరకు ఏ గతి పడుతుందో చరిత్ర చెబుతోంది! దేశ సరిహద్దులను కాపాడటంలో లేని ఉత్సుకత, అవినీతిపరులను అడ్డుకోవడంలో చూపని ఉత్సాహం, ధరలను అదుపులో పెట్టడంలో కనిపించని నిబద్ధత - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు నుక్కలు చెయ్యడానికి ఎందుకు ప్రదర్శిస్తోంది?

పౌరుషం, ఆత్మాభిమానం ఉన్న ఏ జాతి అయినా ఈ పరమ దారుణ విభజన కాండను ఎదురించి తీరుతుంది! తెలుగు సమాజం అక్కర లేదని తీర్మానిస్తే - ఇది నా రాజ్యం - నా ఇష్టం అన్నట్లుగా - నడుస్తున్న ఈ విపరీత వ్యవహారాన్ని - అన్నివిధాలా ఎదిరించి తీరాలి!

ఇదే అంశంపై పార్లమెంటులో పోరాడుతున్న యోధులకు, వీధి వీధినా ఉద్యమాలు చేబట్టిన ప్రజావళికి, సమాచార, ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఉత్సాహం, ఆవేశం నింపుతున్న యువ నేతలకు అభినందనలు! పోరాటం మరింత ఉధృతం చేద్దాం! రాష్ట్రాన్ని సమైక్యంగా నిలుపుకుందాం!! -

No comments:

Post a Comment