Friday, November 11, 2016

నారదుడు: - వీణ సృష్టికర్త అయిన నారదుడు.

నారదుడు లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ,నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ,తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.
ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -
భాగవతం, ప్రధమ స్కంధంలో నారదుడు వేద వ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు. ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వ గాధను వ్యాసునకు వివరిస్తాడు.రామాయణం, బాలకాండలో నారదుడు
వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ ఆనతిస్తాడు. అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.మహాభారతం సభా పర్వంలో నారదుడునారద పురాణమునారద భక్తి సూత్రాలు నారదోపనిషత్తు
నారదుని పూర్వ జన్మ వృత్తాంతం
మహాభాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాధను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.
పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతాని గ్రహించాడు.
అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది - ఈ జన్మలో నీవు నన్ను పొందలలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.
అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడ జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.
ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.
మహాభారతంలో వర్ణన
మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్తవ్య , అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.

No comments:

Post a Comment