Friday, November 11, 2016

త్రిమూర్తులు నెలకొన్న ధర్మపురి

కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ నుంచి 65 కి.మీ.ల దూరంలో, జగిత్యాలకు 27 కి.మీ. ల దూరంలో వున్న ధర్మపురి క్షేత్రంలో గోదావరి దక్షిణ వాహిని. ఇక్కడి గోదావరీ ప్రవాహం లోతు వుండకపోయినా ( నీళ్ళు మోకాళ్ళదాకా కూడా రావు. మామూలు రోజుల్లో చిన్న పిల్లలను కూడా నీళ్ళల్లో ఆడుకోనివ్వచ్చు) నీరు నిర్మలంగా వుండి అడుగున వున్న రాళ్ళూ రప్పలూ కనబడుతూ వుంటాయి. ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు ఏవైనా పూర్వం సంస్కృతీ, సంప్రదాయాల నెలవులే. శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయం వున్నత స్ధితిలో వుండేది. బహుమనీ సుల్తానుల దండయాత్రలలో శిధిలమైన ఈ ఆలయాలు 17 వ శతాబ్దంలో తిరిగి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.. ఇక్కడ గోదావరీ తటాకం లో అతి ప్రాచీనమైన నరసింహాలయమేగాక ఇంకా ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, వినాయకుడు వగైరా మనం అన్ని చోట్లా చూసే దేవతలతోబాటు, అరుదుగా దర్శనమిచ్చే బ్రహ్మదేవుడుకీ, దాదాపు కనిపించని యమధర్మరాజుకీ కూడా ఉపాలయాలున్నాయి. అలాగే ఇక్కడ ప్రవహించే గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, వగైరా గుండాలున్నాయి.
ఈ క్షేత్ర విశేషాలు.... పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు. ఇక్కడి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి. ఆవరణలో నృసింహస్వామిని అష్టదిగ్బంధనం చేస్తున్న ఎనిమిది ఆంజనేయస్వామి విగ్రహాలను దర్శించవచ్చు. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు. రాముడు ప్రతిష్టించిన లింగంగనుక ఇక్కడి శివుడు రామలింగేశ్వరుడైనాడు. ఇది సైకత లింగం. శివుడు, కేశవుడు ఒకే చోట కొలువుతీరారుగనుక ఇది హరి హర క్షేత్రం. బ్రహ్మాది దేవతలిక్కడ తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమినిత్రవ్వి, ఆ కుండములో వచ్చిన నీటితో స్నానము చేసి శ్రీ నరసింహస్వామిని గురించి తపస్సు చేసి, ఆయన అనుగ్రహం పొంది, ఆయన ఆలయంలోనే స్ధానం పొందాడు. ఇక్కడ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మ ఉపాలయం చూడవచ్చు. అందుకనే ఇది త్రిమూర్తుల క్షేత్రం అయింది.
యమధర్మరాజు రోజూ పాపులను చూసీ చూసీ, వారికి శిక్షలు వేసీ వేసీ, తనకి లేనిపోని పాపాలంటుకుంటున్నాయని దీగులుచెంది, ఆ పాప ప్రక్షాళనకు తీర్ధయాత్రలు చేస్తూ, ఇక్కడ గోదావరిలో స్నానం చేశాడుట. దానితో ఆయనకి మనశ్శాంతి లభించి, నరసింహస్వామి మందిరానికెళ్ళి పూజించాడు. నరసింహస్వామి ప్రసన్నుడై ఇంకముందు నీముందుకెలాంటి పాపాత్ముడు వచ్చినా నీకెలాంటి దోషమూ వుండదనే కాక తన సన్నిధిలో నివసించమని కూడా ఆనతినిచ్చాడు. నరసింహస్వామి ఆలయం వెలుపల వున్న యమధర్మరాజు ఆలయం దర్శించి, అక్కడ గండ దీపంలో నూనె సమర్పించినవారికి అపమృత్యు దోషం వుండదనీ, మృత్యు భయం వుండదనీ ప్రతీతి. యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి యమకుండమని పేరు.
పూర్వము వీరసేనుడనే రాజుకి విజయ అనే కుమార్తె వుండేది. అత్యంత సౌందర్యవతి అయిన ఆమెకు విధివశాత్తూ ఒక సర్పంతో వివాహం జరిగింది. ఆవిడ ఆ సర్పాన్ని వెంటబెట్టుకుని తీర్ధయాత్రలు చేస్తూ ఇక్కడకొచ్చి సర్పరూపంలో వున్న తన భర్తతోసహా గోదావరిలో సరిగంగ స్నానం చెయ్యగా ఆమె భర్తకి సర్ప రూపం పోయి నవ యవ్వనుడుగా కనిపించాడు. భర్తతో సహా నరసింహస్వామిని అర్చించి తన దేశానికి వెళ్ళిన విజయ అక్కడివారికి తన పాతివ్రత్యాన్ని నిరూపించటానికి వారిని తీసుకుని తిరిగి ధర్మపురికి వచ్చింది. నరసింహస్వామిని ప్రార్ధించి, స్వామీ నీవే నా పాతివ్రత్యాన్ని వీరందరికీ తెలియజెయ్యాలని మూడు పిడికిళ్ళ ఇసుక కుప్పలా పోసింది. అది వెంటనే ఒక పెద్ద ఇసుక స్తంభమయింది. దానిని ఇప్పటికీ చూడవచ్చు. విజయని అప్పటినుంచి అందరూ సత్యవతి అని పిలిచారు. ఆ దంపతులు స్నానం చేసిన కుండం సత్యవతీ కుండంగా పేరుగాంచింది. ఇక్కడ సరిగంగ స్నానాలు చేసి స్వామిని దర్శిస్తే అత్యంత ఫలప్రదాయకం.
కుజదోషనివారణ
యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ది చెందింది. కుజదోషమున్న వారు ఈ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణము చేయిస్తే వారికా దోషం పోయి, శీఘ్రంగా వివాహమవుతుందని భక్తుల నమ్మకం. సాధారణంగాకుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవవచ్చు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. చూపిస్తుందంటారు. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చిస్తే ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. ధర్మపురిలో యోగనారసింహుడు, ఉగ్రనారసింహుడు, ప్రహ్లాదనారసింహుడు, లక్ష్మీ నారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి.
ఫాల్గుణ శుధ్ధ ఏకాదశి
స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుధ్ధ ఏకాదశినుంచి 13 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు మన రాష్ట్రాలలోని నలుమూలలనుంచేకాక, మహారాష్ట్రనుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలున్న క్షేత్రాలను అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.టంలో అతి ప్రాచీనమైన నరసింహాలయమేగాక ఇంకా ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, వినాయకుడు వగైరా మనం అన్ని చోట్లా చూసే దేవతలతోబాటు, అరుదుగా దర్శనమిచ్చే బ్రహ్మదేవుడుకీ, దాదాపు కనిపించని యమధర్మరాజుకీ కూడా ఉపాలయాలున్నాయి. అలాగే ఇక్కడ ప్రవహించే గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, వగైరా గుండాలున్నాయి.

ఓం విగ్నేశ్వరాయాణనమః

ఓం.నమో నమో వేంకటేశాయా


హథీరాంబావాజీ . కథ

క్రీస్తుపూర్వము ''650'' సంవత్సరముల క్రితము ఉత్తర బారతదేశము నుండి బావాజీ అను రామ భక్తుడు తిరుమలకు వచ్చినారు, తిరుమలలో ''40'' సంవత్సరాలు కఠోర తపస్సు చేసుకొంటూ తమ తపశ్శక్తితో ఒక వృక్షము యొక్క ఆకులను తీయగా మార్చుకొని ఆ ఆకులనే (కందమూలములు) ఆహారముగా భుజిస్తూ తపస్సు చేసుకుంటున్నారు బావాజి, 


బావాజీ తపస్సుకు మెచ్చిన శ్రీనివాసుడు బావాజీతో స్నేహము ఏర్పరుచు కొని ప్రతిరోజూ కొంత సమయము బావాజీతో గడిపేవారు, అలా కొంత కాలము గడిచిన పిమ్మట సరదా కోసము బావాజీతో శ్రీవేంకటేశ్వరస్వామి పాచికలు ఆడేవారు ఎప్పుడూ బావాజనే గెలిచేవారు శ్రీవేంకటేశ్వరస్వామి ఓడి పోతూ వుండేవారు ఒకరోజు బావాజీ ,
శ్రీనివాసుడుని అడిగేను. స్వామీ మీరు ప్రతీ సారీ ఓడి పోతున్నారు ఒకసారి ఐనా గెలవండి చూద్దాము అనెను,
అందుకు స్వామివారు బావాజీ నేను గెలవాలి అంటే ఏదైనా పందేముగా పెట్టవలెను, అప్పుడు నేను ఓడిపోతే నీకు ఒక అమూల్య మైన బహుమతి ఇస్తాను మీరు ఓడిపోతే ఏమి ఇస్తారు అని అడిగేను. అందుకు బావాజీ అన్నారు, హే! నారాయణా నాదగ్గరయేమి ఉంటుంది ,శరీరము మీద ఈ గోచీతప్ప మీరు అడుగు చున్నారు కనుక ఓక వేళ నేను ఓడిపోతే నాప్రాణమును మీకు అర్పిస్తాను, అని బావాజీ తన ప్రాణనమును పందేముగా పెట్టి ఆడుచుండెను,
విజయము స్వామీ వైపే కనబడుచున్నది, బావాజీ. అనుకున్నారు నా రాముడు ఐన ఈ శ్రీకృష్ణుడు శ్రీనివాసుడే నాప్రాణములు అడగగా నేను ఇవ్వక పోవుటయా ఇంత కన్నా భాగ్యమా నాకు మరో అవకాశము రాదు ఇన్నాళ్లకు నారాముడు నాకు ముక్తిని ప్రసాధించనున్నారు.అనుకొనేను బావాజీ,
తాను ఒకటి తలచితే ఆభగవంతుడు ఒకటి తలిచెను
శ్రీనివాసుడు అయిన శ్రీమన్నారాయునుడు తలిచెను నేను
విజయము పొందినచో నాభక్తుడు ప్రాణ త్యాగముచ్చేయును
నేను కాపాడవలసిన నాభక్తుడను నేనే ప్రాణములు అడుగుట భావ్యముకాదు అనుకోని శ్రీవేంకటేశ్వరస్వామి. ఓడి పోతారు, ఓడిన పిమ్మట పందెము ప్రకారము స్వామీ
మెడలోని. చంద్రహారము తీసి బావాజీమెడలో వేసెను .
స్వామీ నాకు ఎందుకు ఈ బంగారు వజ్ర వైడూర్యములు.
కానుకలు సన్యాసి అయిన నాకు వీటితో పని యేమి ఉంటుంది మీరే తీసుకెళ్ళండి స్వామీ .నాకు వద్దు అని పలికెను బావాజీ, పందెములో మాట ఇచ్చాను మీరే ఉంచుకొండి అని చెప్పి స్వామీ వెళ్ళిపోయేను ,
మూలవిరాట్టు మెడలో చంద్రహారము కనిపించలేదు అని గుడిలోని పూజారులు రాజుగారికి పిర్యాదు చేసినారు, రాజుగారు భటులను పిలిచి శ్రీవేంకటేశ్వరస్వామి. మెడలో చంద్రహారము చోరీ ఐనది తక్షణమే వెల్లివెతకండి దొంగ దొరికితే కొట్టి బంధించి తీసుకరండి అని ఆదేశించెను రాజు,
భటులు వెతుకుచుండగా బావాజీ మెడలో చంద్రహారమును కనిపించెను. బావాజీని భటులు బాగాకొట్టి బంధించి రాజు ముందు నిలబెట్టెను,
బావాజీ మెడలో హారమును చూసిన రాజు, ఓరీ పాపాత్ముడా, సన్యాసివి, రామ భక్తుడివి, మేము మిమ్మలను గౌరవించితిమి, నీవు చోరుడవు అని ఇప్పుడే తెలిసినది. స్వామీ భక్తుడని చెప్పుకొంటూ స్వామి హారమునే దొంగ తనము చేసినాడు ఈ పాపి ఇతనిని కఠినముగా శిక్షించండి అని భటులకి ఆదేశపరిచెను రాజు,
ప్రభూ! నేను దొంగను కాను ఈ హారమును నేను దొంగ తనము చేయలేదు నాతో స్వామివారు పాచికలు ఆడి ఓడిపోయారు ఆస్వామియే బహుమానముగా. ఈ హారమును నా మెడలో వేసారు. నాకు వద్దు వద్దు అని చెప్పినా, నామెడలో వేసి వెళ్ళిపోయారు. ఈవేళ నన్ను ఇచట దొంగగా నిలబెట్టాడు నాస్వామి. అని రాజుకి బావాజీ విన్నవించు కొనెను.
ఏమిటి ఆశ్రీనివాసుడే వచ్చి మీతో పాచికలు ఆడారా ? మీరు గెలిచారా ? ఆస్వామియే చంద్రహారమును నీ మెడలో వేసారా?
మాకు కథలు చెప్పుచున్నావా సన్యాసి ...
కథ కాదు ప్రభూ నేను చెప్పేది నిజము నారాముడు మీద ప్రమాణము, నాకు ఆశ్రీనివాసుడే ఈ హారమును నామెడలో వేసారు తమరు నన్ను నమ్మక పోతే ఇక ఏశిక్షయినా విధించండి.ప్రభూ..
ఓయీ సన్యాసీ నీవు చోరీ చేసినది శ్రీవేంకటేశ్వరస్వామి చంద్రహారమును. చోరీచేసి ఆస్వామియే ఇచ్చారు అని అబద్ధమాడుచున్నావు.. లేదు ప్రభు నేను అపద్ధము పలక లేదు సత్యమే పలుకుచున్నాను...సన్యాసి నీవు చెప్పేది నిజమే అయితే ఆస్వామి మీద నీకు అంత భక్తి ఉంటే మేము నీకు ఒక పరీక్ష పెడుతాము ఆపరీక్షలో నెగ్గి బయటకి రా, భటులారా బావాజీని చేరశాలలో భంధించి ఆగదినిండా చెఱకు గడలతో నింపండి, ఉదయానికెల్లా ఆచెఱుకు అంతయునూ. తిని బయటకు రా సన్యాసి నీవు ఎంత నిజాయతీ గలవాడివో ఉదయాన్నే చూస్తాను అని రాజు వెళ్ళి పోయేను,
రాజు ఆజ్ఞప్రకారము గది నిండా చెఱకు గడలతో నింపి బావాజీని ఆగదిలో బంధించి ఓ సన్యాసి నిను రక్షించ మని
ఆదేవునే వేడుకొ అని వెటకారంగా చెప్పి వెళ్ళిపోయారు భటులు,
బావాజీ బాధ పడుచూ హే రామా వద్దు వద్దు అన్నా ఈ హారమును నామెడలో వేశావు అమూల్యమైన బహుమానము అంటే ఇలా కొట్టించడమా. చేరశాలలో బంధించడమా నన్ను అందరూ చోరుడు అంటున్నారు, ఏనాడు మిమ్మలను ఏమీ అడగలేదు స్వామీ ఈ వేళ అడుగు చున్నాను నన్ను కాపాడు ఈ చేరసాలనుండి విముక్తి కలిపించు నాకు నీవు తప్ప దిక్కెవరు నను కాపాడు స్వామీ అని వేడుకొనేను బావాజీ ,
బావాజీ బాధపడుచూ చేస్తున్న ప్రార్ధనను మన్నించిన శ్రీనివాసుడు. ఏనుగు. రూపమున వచ్చి బావాజీని బంధిచిన గది గోడలను పడదోసి బావాజీని చేరసాల నుంచి విముక్తి చేసి గదిలోని చెఱకు గడలను అంతయును తినివేసి మదమెక్కిన ఏనుగువలే ఘీంకరించెను ఆదృశ్యము చూసిన ప్రజలు బయముతో పరుగులు తీసేను ఏనుగు రూపమున వచ్చిన రాముడిని బావాజీ అనేక విధములుగా ప్రార్ధించి ఎవరికీ హాని తలపెట్టకు స్వామీ అని వేడుకొనేను
బావాజీ ప్రార్థనకు శాంత్తించి ఏనుగు వెళ్ళిపోయేను, ఈ దృశ్యమును భటులు ద్వారా విన్న రాజు పరుగు పరుగున వచ్చి బావాజీ కాళ్ళ మీదపడి క్షమించమని వేడుకొనేను దయా మయుడయిన బావాజీ రాజుని క్షమించెను
ఏనుగు రూపమున, రాముడు, బావాజీకి, దర్శినము ఇచ్చినాడు కనుక, అప్పటినుండి హథీ,రామ్,బావాజీ,(హథీరాంబావాజీ)అను నామము ప్రసిద్ధిచెందెను, హథీరాంబావాజీ, భక్తికి చిహ్నముగా ఆరోజు నుండి నేటివరకు బావాజీ పేరుతో ఆలయములో నిత్యమూ వేకువజామున సుప్రభాతసేవాలో గోక్షీరనివేదనము, నవనీత హారతి సమర్పించే. ఆచారము నేటికీ కొనసాగుచున్నది, బావాజీతో. స్వామివారు పాచికలు ఆడిన పుణ్యస్థలమును మీరూ తిలకించవచ్చు, శ్రీవారి ఆలయమునకు ఆగ్నేయమున హథీరాంబావాజీ మఠము నందు ఈపుణ్యస్థలము కలదు చూసి తరించండి, బావాజీ తపశ్శక్తితో తీయగా చేసిన వృక్షము ఆకులు మీరూ తినవచ్చును (లభించు ప్రదేశము ) పాపవినాశనము కు వెళ్ళే మార్గమున వేణుగోపాలస్వామి గుడి ప్రక్కన హథీరాం బావాజీ సమాధి ఉంటుంది ఈసమాది వద్ద మహంతులు (పూజారులు) బావాజీ తిని జీవించిన ఆకులను ప్రసాధముగా ఇస్తూ ఉంటారు,మీరూ తిని చూడండి తీయగా ఉంటుంది ,శ్రీవేంకటేశ్వరస్వామి తమభక్తులను ఆపదలో ఏదో ఒక రూపమున తప్పక వచ్చి. కాపాడుతారు అనడానికి నిదర్శన మే. ఈ బావాజీ కథ,
మనము తిరుమలలో దర్షించుకుంటున్న శ్రీవేంకటేశ్వరస్వామి ప్రాణమున్న " సాలిగ్రామా శిలారూపము " ప్రాణముంది కనుకనే, అనంతాళ్వారులు కు సహాయము చేయడానికి వెళ్లి గడ్డము మీద. గుణపముతో కొట్టించుకొని వచ్చారు, తిరుమలనంబికి ఆకాశగంగను చూపించారు, బావాజీతో కూర్చొని పాచికలు ఆడారు అన్నమయ్య దగ్గర పాటలు పాడిించుకొన్నారు, తగొండ వేగమాంబతో పూల హారములు కట్టించుకొన్నారు శ్లోకాలు చదివించుకొన్నారు, ఇంతకన్నా నిదర్శనము ఏమికావాలి

పెళ్లినాటి ప్రమాణాలు ...

పెళ్ళినాడు మీరు అన్నిటికి ఒప్పుకొని చేసిన ప్రమాణాలను ఎలా మరుస్తారు ??
'ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి' అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే 'ధర్మమునందు గాని, సంపదల విషయములందు గాని, శారీరక సుఖ విషయములందు గాని, దాన ధర్మములవల్ల లభించు మోక్ష విషయములందు గాని నిన్ను విడిచి నడువను.' అని వధువును పరిగ్రహించే ముందు వరునిచేత ప్రమాణం చేయిస్తారు. తరువాత మాంగళ్యధారణ సమయం లో కూడ ప్రమాణం లాంటి మంత్రాన్నే ఈ విధం గా చెబుతాడు వరుడు.
'మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా.
కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదశ్శతం '
అనగా : ఓ మాంగళ్యమా! నా జీవనానికి కారణ భూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువు గాక!. ' అని చెప్పి మాంగళ్యాన్ని వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కడతాడు.... త్రిమాతలైన లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి లకు అంకితం గా మూడు ముళ్ళుగా వాటి యొక్క పవిత్ర చిహ్నంగా అవి పేర్కొనబడతాయి ...
సప్తపది లో కూడా ... ' ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు' అనే మంత్రాలతో ఏడడుగులు వేయిస్తారు....
మొదటి అడుగు శక్తి కోసం, రెండవ అడుగు బలం కోసం, మూడవ అడుగు వ్రతం కోసం, నాల్గవ అడుగు ఆనందం కోసం, ఐదవ అడుగు ఇంద్రియ బలం కోసం, ఆరవ అడుగు రుతువుల కోసం, ఏడవ అడుగు గృహ ధర్మాల కోసం.. ఇద్దరమూ జీవితాంతం ఇలాగే కలసి నడుస్తాము అని అగ్ని సాక్షి గా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది తో వధువు యింటి పేరు మారిపోతుంది. వివాహానికి ఈ కార్యక్రమమే చాలా ముఖ్యమైనది.... పెళ్లి నాటి ప్రమాణాలు అంటే ఇవి... వీటిని పురుషుడు తప్పనిసరిగా అనుసరించి ఆచరించిన నాడే.. పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకుంటుంది. భర్తకు భార్య.... భార్య కు భర్త ..... అన్యోన్యంగా తోడు, నీడగా .. అరమరికలు లేకుండా అర్ధ నారీశ్వర తత్వం తో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు అర్ధం, విలువ వుంటుంది.
కీచులాటలతో, వివాదాలతో, నిత్య సమస్యలతో... నిండు జీవితాలను బండల పాలు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు వివాహ ప్రయోజనాలను అర్ధం చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి....
ఇదీ మన హిందూ ధర్మం లో వివాహం యొక్క గొప్పదనం

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం

కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం.కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి లోని వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణభారత దేశం లోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గా విరాజిల్లుతోంది.
స్థల పురాణం:------ స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారం తో విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్నిసైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది.గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్నినివారించ గలిగేది అగస్త్యమహర్షి మాత్రమే నని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షి కి , విషయాన్ని వివరించారు.
యోగదృష్టి తో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీ ని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు . లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని , దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.
పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను ,శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.
“ వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్య మనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.
కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి.
“ సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు.వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.
“ కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.
ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు.మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది ,గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా ఉండి , భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.
ఆలయప్రత్యేకత.:----- స్వామివారి ఆలయం తూర్పుదిశ గా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగు తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.
స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.
విశేష పూజలు :------. నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు.
స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది.ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతువు ,సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ఉగాది ప్రవదినం,దసరా శమీపూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రో త్సవము విశేషంగా జరుగుతాయి.
మాఘమాసం లో కళ్యాణోత్సవం, రథోత్సవం,వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
భక్తుల సౌకర్యార్ధం నిత్యాన్నదాన పథకం ఇటీవలె ప్రారంభించబడింది
రవాణా సౌకర్యాలు . :------- కృష్ణాజిల్లా లో విజయవాడ కు 70 కి. మీ దూరం లోను,మచిలీపట్టణానికి 35 కి.మీ దూరం లోను, గుంటూరు జిల్లా రేపల్లె కు 8 కి. మీ దూరం లోను మోపి దేవి క్షేత్రం ఉంది.అతి సమీపం లోని రైల్వేష్టేషన్ రేపల్లె.
ఇక్కడ ఉండటానికి ఎటువంటి హోటల్ సౌకర్యాలు ఉండవు. గ్రామీణ స్థాయి కాఫీహోటల్స్ మాత్రం ఉంటాయి. అవనిగడ్డ, రేపల్లె, చల్లపల్లి లో ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి. 214 ఎ జాతీయ రహదారిపై చల్లపల్లి – పులిగడ్డ మధ్య మోపిదేవి క్షేత్రం ఉంది.


నాగదోషాలకు, సంతాన రాహిత్యా నివారణకు ,జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం గా శాస్త్రాలు చెపుతున్నాయి.

శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

ఆధ్యాత్మికతవెల్లివిరిసే మన దేశంలో ఎన్నో అపురూపమైన దేవాలయాలు, వాటి గురించి ఇంకెన్నో అద్భుతమైన కధనాలు…తెలుసుకున్నకొద్దీ ఆశ్చర్యం..తరచి చూసినకొద్దీ అద్భుతం. ఇలాంటి అద్భుతాల గురించి తెలుసుకుని, వాటిని దర్శించి, గౌరవించాల్సిన కనీస బాధ్యత ఈ దేశ ప్రజలమైన మనది. అయితే మన దురదృష్టమేమిటంటే మన అశ్రధ్ధనండీ, తెలియకపోవటంవల్ల కానీయండీ, తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవటంవల్ల కానీయండీ, సమయాభావంవల్ల కానీయండీ, మన సంప్రదాయాలూ, ఆలయాల పట్ల మనకు తగ్గుతున్న ఆసక్తివల్ల కానీయండీ, ఏ ఇతర దేశాలకీ లేనటువంటి ఇంత ఆధ్యాత్మిక, కళా సంపదను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఐతిహాసిక గాధలకీ, మన భారత దేశానికీగల సంబంధ బాంధవ్యాలను మనం విస్మరిస్తున్నాం. తద్వారా మన భావి తరాలకు వాటి విలువ తెలియకుండా చేస్తున్నాం. మీ చుట్టుపక్కలే ఎన్నో అపురూపమయిన, అతి పురాతనమైన ఆలయాలు అద్భుత శిల్ప సంపదతో, అనేక విశేషాలతో, అలరారేవెన్నో వున్నాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు గ్రామంలో వున్న శ్ర్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం గురించి ఇప్పుడు చెప్తాను.
పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి 5 కి.మీ. ల దూరంలో వుంది యనమదుర్రు గ్రామంలోని ఈ ఆలయం. అయితే ఎందుకనో భీమవరంలోని భీమేశ్వరాలయం, మావుళ్ళమ్మ ఆలయం ప్రసిధ్ధి చెందినట్లుగా ఈ శక్తీశ్వరాలయం ప్రసిధ్ధి చెందలేదు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి. వంద ఏళ్ళ క్రితంవరకు ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియదు. వంద ఏళ్ళ క్రితం త్రవ్వకాలలో త్రేతాయుగంనాటి ఈ ఆలయం బయటపడింది. అంతేకాదు. ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికా అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది. బహుశా పార్వతీదేవిని ఈ భంగిమలో ఇంకెక్కడా చూడమేమో.

అలాగే శివుడుకూడా ఏమీ తక్కువతినలేదు. తనూ ఒక ప్రత్యేక భంగిమలో వెలిశాడు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలోకూడా వైవిధ్యం చూపించాడు పరమేశ్వరుడు. అవునండీ. శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతాడు శివుడు ఇక్కడ. మళ్ళీ చదవక్కరలేదు. మీరు చదివింది కరెక్టే. శివుడేమిడీ, శీర్షాసనమేమిటీ అంటారా. మీ కోసమే ఆ విగ్రహాల ఫోటో. ఈ భంగిమలు జాగ్రత్తగా గమనించి, బాగా గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళండి ఆ ఆలయానికి. చూడండి.. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. ఈ వ్యాసం చదివిన వాళ్ళంతా ఈ దంపతుల అత్యద్భుతమైన ఈ భంగిమలు చూడటానికే ఈ ఆలయానికి వెళ్ళి వస్తారనే నమ్మకం వుంది. ఇంతకూ ఈ పార్వతీ పరమేశ్వరులు అంతర్జంటుగా ఎలా వున్నవాళ్ళ అలాగే ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా చెప్తారు. ఆ కధేమిటంటే….

మీరు యమధర్మరాజు గురించి వినే వుంటారు. భయమేస్తోందా. పాపం యమధర్మరాజుకి కూడా ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారాయే. అందుకనే మార్గాంతరంకోసం శివుడుకోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్ లో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు వుంటే సత్వరం నయం అయి, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయం చేయగలవాడు కూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చాడు.

పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబరుడనే రాక్షసుడుండేవాడు. రాక్షసుడంటే వాడి అకృత్యాలూ, మునులను హింసించటాలూ వగైరా షరా మామూలే. పాపం ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడుకూడా పాపం మునులంతా అడిగారుకదా అని ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. అప్పుడు శివునికోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు. పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, ప్రత్యక్షమై, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు.

అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్ లో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో, యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది. దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు. ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగంనాటివాడు. అందుకనే ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా ప్రసిధ్ధికెక్కింది.


ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారుట. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అందర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.

దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవలి కాలందాకా వుండేవని పూజారి చెప్పారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగు పాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట. అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.

ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్నున్నయ్యోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి.

పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నదిట.

శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కవిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

చూడటానికి చిన్నదిగా వున్నా, ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అవకాశం దొరికినప్పుడు తప్పక దర్శించండి.

విగ్రహ ఆరాధన ఎందుకు చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ??

సర్వాంతర్యామియైన భగవంతుడు కేవలం తపఃసంపన్నులను, యోగులకే చూడ సాధ్యమవుతాడు. ఆకారణంగా సామాన్యులకు ‘అర్చావతారవిగ్రహా’లే శరణ్యమవుతున్నాయి.
విగ్రహాలలో భాగాచ్చక్తి నింపటానికి మంత్రం, యంత్రం, తంత్రం అనే మూడు సాధనములు ఉన్నాయి. భగవతత్వం ప్రప్రథమంగా శబ్దంచే గ్రహింపబడుతుంది. భగవద్రాహకమగు శబ్దమేది ఉందో, అదే ఆ దైవం యొక్క మంత్రంగా నిలుస్తోంది.
నిత్యపూజాగృహములయందు పూజావిగ్రహాలు 4 అంగుళాలు మొదలు 12అంగుళాల వరకు ఉండాలి. పూజా ప్రతిమలు రత్నాలతో తయారైనవైతే అత్యుత్తమం. ఆ తరువాత బంగారం, వెండి, రాగి లోహాలతో విడివిడిగా గాని, ఈ లోహములన్నింటిలో కలిపి గాని (పంచలోహాలు) చేయుంచుకోవటం ఉత్తమం. రాయితో తయారైనవి మధ్యమం, చెక్కలతో తయారైనవి అధమం. దైవపటాలకన్నా విగ్రహాలు శ్రేష్ఠం. అందులోనూ పంచలోహాల విగ్రహాలు గాని, శిల, దారు, మృత్తికావిగ్రహాలు కాని, శక్త్యానుసారంగా ఉపయోగించుకోవచ్చు.
దైవవిగ్రహాలు చూడటానికి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మనస్సుని ఆకట్టుకునే విధంగా, కళాత్మకంగా, సుందర మనోహరంగా తీర్చిదిద్దిఉండాలి.
ఇంట్లో ఈశాన్యభాగంలోగాని, ఉత్తర, తూర్పుభాగాలలోగాని పూజామందిరాన్ని ఏర్పరచుకోవాలి. పూజామందిరంలో ఈశాన్య, తూర్పు, ఉత్తర భాగాలలో ఉన్నతమైన స్థలంలో గాని, ఎత్తైన పీఠంపైగాని పూజావిగ్రహాలను ప్రతిష్టించాలి. దైవవిగ్రహాలకు ఎదురుగా కూర్చుని పూజించరాదు.
సగుణ జ్ఞానహీనస్య నహినిర్గుణ వేదనమ్
నందిదర్శన హీనస్య యథా న శివదర్శనమ్
ఎలాగైతే నంది దర్శనాన్ని చేయలేనివాడు శివదర్శనాన్ని చేయలేకపోతాడో, అలాగు సగుణజ్ఞానంలేనివానికి నిర్గుణజ్ఞానం సిద్ధించదు. పెద్దఆకారంతో గర్భగుడికి బైటనున్న నందీశ్వరుని చూడజలని అశక్తుడు చీకట్లో చిన్నదిగా ఉన్న శివలింగాన్ని ఎలా చూడగలడు? అని శివపూరానం చెబుతోంది. అందుకనే సగుణరూపంలో మనకోసం భూలోకానికి విచ్చేసి కొలువైన దైవాలను నియమనిష్ఠలతో పూజించి వారి ముందు మన లోరికలను ఉంచి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో మన జన్మలను ధన్యం చేసుకుందాం.
హిందూమతంలో పధానమయినది ఏకేశ్వరభావాన. ఏ దేవుని పూజించినా ఆ పూజలన్నీ ఏకేశ్వరునికే చెండుతాయన్నది ప్రతి ఒక్క హిందువు అపర నమ్మకం! మన సాంప్రదాయాలు ,సనాతనధర్మం ,భక్తి ,అంతర్యమి ల నుండి సేకరించిన సమాచారము
సేకరణ : గూగుల్ సర్చ్ నుండి

వైద్యశాస్త్రంలో భారతీయుల ప్రతిభ వేల ఏళ్ల నాటిది.....

ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే.......
సుశ్రుతుల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వారిగా ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ,మన పురాణేతిహాసాల ప్రకారం ఆయన దాదాపుగా 5000 ఏళ్ల పూర్వం వారు. మనకు చరిత్రను రాసింది పాశ్చాత్యులు కావడం వలన, వాళ్లు బైబిలులో ఉన్నట్లుగా సృష్టి ఆవిర్భవించి ఆరు వేల ఏళ్లకంటే ఎక్కువ కాలేదని తీవ్రంగా నమ్మడం వలన, ఎవరినీ 3000 ఏళ్ల పూర్వం వాళ్లుగా అంగీకరించలేకపోయారు.
సుశ్రుతులు వేల ఏళ్ల క్రితమే వారణాసిలో జన్మించారు. ఆయుర్వేద వైద్య పితామహులుగా ఖ్యాతి గడించిన ధన్వంతరి వద్ద విద్యనభ్యసించార
ు. పాశ్చాత్య ప్రపంచం విజ్ఞాన పరంగా కళ్లు తెరవక ముందే ఆయన సర్జరీ చేసి చూపించారు.
1) పక్షుల ముక్కుల రూపురేఖలను అనుసరించి, దృఢమైన పట్టు ఉండే విధంగా, సుశ్రుతులు సర్జరీ పరికరాలను తయారు చేసి, వినియోగించినట్లుగా తెలుస్తోంది.
2) వైద్య నియమ సూత్రాలూ, శస్త్రచికిత్స, పురిటి విధులు, మందులు, ఔషధజ్ఞానం మానవశరీర నిర్మాణాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
3) కొన్ని ఉత్పాదకాలు, వనమూలికల మొక్కలు, పుష్ప, ఫలాల ఔషధ మొక్కల గుర్తింపు, లాంటి వృక్షాల్లో ఔషధగుణాల్ని ఆయన కనిపెట్టారు.
4) శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని విశదీకరించే సుశ్రుత సంహిత అనే అద్భుత గ్రంథాన్ని ఆయన సంస్కృతంలో రచించారు.
5) మెడ నుంచి ముఖం వైపు చర్మపు పొరల ప్రతిరూప చికిత్స, ప్రస్తుత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ కి సుశ్రుతులు నాందీ పలకడంతోనే ఆయన ప్రజ్ఞ అర్థమవుతోంది.
6) తెగిపోయిన, మరియు కోతకు గురైన ముక్కుకు, ప్లాస్టిక్ సర్జరీని చేసి చూపించారు.
7) సుశ్రుతులు సర్జరీ సందర్భంలో రక్తస్రావాన్ని అరికట్టే విధానంలో చీమతలను బంధన సూత్రంగా వినియోగించే కొత్త పద్ధతి కనిపెట్టారు.
8) సుశ్రుత సంహిత ప్రకారం, సర్జన్ కు ఉండవలసిన లక్షణాలు, ధైర్యం, చురుకుదనం, తక్షణచర్య, పరికరాల పదును, చెమట వణుకు లేకపోవడం..
9) ప్రొస్టేట్ గ్రంధిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్దతులను సుశ్రుతులు వేల సంవత్సరాల క్రితమే శోధించి, మానవజాతికి అందించారు.
10) ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు.
11) మూత్రనాళం లో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో, సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించారు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను, వారి శస్త్రచికిత్సా విధానం ద్వారా విజయవంతంగా తొలగించారు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.
12) పోస్ట్మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతులు.శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి, పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత, శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.
13) గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సుశ్రుతులు.
14) నూతన మిలీనియం సందర్భంగా, 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో పాటుగా వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతులది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది
15) ఇలా చెప్పుకుంటూ పోతే సుశ్రుతుల ప్రతిభ అనంతమని తెలుస్తుంది.
16) అన్నీ పాశ్చాత్యులే కనిపెట్టారనీ, భారతీయులకు ఏమీ చేతకాదనీ, అన్నీ పాశ్చాత్యులు పెట్టిన భిక్షే అనీ, మనం ఆత్మన్యూనతకు లోను కాకుండా, వారిని ఆదర్శపురుషులుగా తీసుకుని, వారి మార్గంలో నడవడానికి సంకల్పిస్తే రేపటి రోజు మనదే కావచ్చు.