Friday, November 11, 2016

ద‌త్తాత్రేయుడు

దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.
ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.
శ్రీ దత్తాత్రేయ స్వామి.......!!
దేవహుతి మరియు కర్ధముని కుమార్తె అనసూయ . అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది.
అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయ దేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి, ఆర్ఘ్య – పాదాదులు సమర్పించి, మీకు నేనేమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సుకోసం అరణ్యంలోకి వెళ్లారు. అపుడు అతిథులు ‘ అమ్మా! మాకెంతో ఆకలిగా ఉంది, నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు’ అన్నారు. ఆమె లోపలకు వెళ్లి విస్తర్లు వేసి, అయ్యలారా! భోజనానికి దయజేయండి. అని ప్రార్ధించింది.
అపుడు వారు ‘సాధ్వీ, మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము’ అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక, ఆకలితో తిరిగిపోయిన అతిథి, గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కాని పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది! పరస్పర విరుద్దమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది.
అయ్యలారా అలానే చేస్తాను, భోజనానికి లేవండి! అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో, స్వామి, ‘నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను. ’ అని చెప్పుకొన్నది.
ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన
సంకల్పం వలన ఆమె భోజనంవడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యమొచ్చింది.ఆమె ఆ వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది. ఆ మహా పతివ్రత తన దివ్యద్రుష్టివలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొన్నది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి,ఆమె నుండి సర్వము తెలిసికొని ఊయలలొని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను స్తుతించాడు.
అప్పుడు అత్రి మహర్షి భార్యవైపు చూస్తూ ‘ సాధ్వీ, వీరు మనస్సు చేతగూడ పొందడానికి వీలుగానివారు. అయినా నీ భక్తీ వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు.’ అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడడ్డారు. కనుక ఈ మూడు మూర్తులగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతార కార్యం నేరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రిమహర్షి సంతోషించాడు.....
మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్దరించండి అని కోరాడు. అపుడు వారు మహర్షీ మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము. ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే; శ్రుతులకు గూడ అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవుల అభీష్టాలు నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణమే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు.
ప్రతి సంవత్సరం మార్గశిర మాస పౌర్ణమి రోజున శ్రీ దత్త జయంతి జరుపుకుంటారు. మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర , కర్ణాటక మరియు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దత్త జయంతి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కలకోట మహరాజ్ మొదలగు అవతార పురుషులను శ్రీ దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణిస్తారు.
కర్ణాటకలోని గాణుగాపూర్, మహారాష్ట్రలోని కారంజ, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం ప్రసిద్ధ దత్త క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.

No comments:

Post a Comment