Thursday, February 13, 2014

అంతం కాదిది ఆరంభం!?

1940-50లలో మన తమిళ సోదరుల్లో ఒక సమరశీల వర్గం ప్రత్యేక ద్రవిడనాడు అంటూ ఒక సర్వసత్తాక స్వతంత్ర తమిళదేశ స్థాపన దిశగా ఏదో కొంత మోతాదులో ఉద్యమిస్తేనే దేశమంతా గగ్గోలు పెట్టేసింది. మనం తెలుగు వాళ్లం, అలాగే కన్నడిగులు వగైరాలు దానితో మాకేమీ సంబంధం లేదు, ద్రవిడకుటుంబం కావచ్చు కాని మేము మొదట భారతీయులం ఆ తర్వాతే తెలుగు వాళ్లం [కన్నడిగులం ] అని చెప్పుకుని తమిళుల్ని ఈసడించుకున్నాం. అలాగే శ్రీలంక తమిళ ఈలం ఉద్యమాన్ని కూడ తెలుగు వాళ్లు ఎప్పుడూ పెద్దగా సమర్థించలేదు అంటే ఆ కారణం చేతే. రాయప్రోలు సుబ్బారావుగారు ఆంధ్ర జాతి, భాషాభిమానాలగురించి గేయాలు రాసినా, ఆయన రాసిన ప్రముఖ గేయంలో మాత్రం తెలుగు ప్రసక్తే లేకుండా "పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం" అంటూ వున్నది ఒకే జాతి, అది హైందవ జాతి [భారత జాతి] అని మన తెలుగు జాతి అస్తిత్వాన్నికూడ తడమకుండా ఒక జాతీయ గీతంలా రాసాడు. భాషాప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న వారిలో మనం ఆంధ్రులం మొదటి పీటీలో వుండినా, ఆ విషయంలో మన ఆంధ్రోద్యమం దేశానికే గర్వకారణంగా, మహాత్మ గాంధీకి సైతం ప్రేరణగా వుండినా, మనం తెలుగు వాళ్లం ఎప్పుడూ ఒక స్వతంత్ర జాతి అస్తిత్వంకోసం డిమాండు చేయలేదు. అంతగా భారత జాతీయోద్యమంలో లీనమై అపార సేవలు అందించాము. ఆ మాటకొస్తే భారత దేశం రాజకీయంగా ఐక్యమై, భారత జాతిగా ఒక అస్తిత్వం కలిగివున్న కాలాలు చరిత్రలో బహు తక్కువే. బ్రిటిషు సామ్రాజ్యవాదుల పాపమో, పుణ్యమో ఆ ఫలంగానే నేటి ఐక్య భారత అస్తిత్వం రూపుదిద్దుకున్నదనేది తిరుగులేని వాస్తవం. దీనితో పోలిస్తే మన తెలుగు జాతి ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వంగా వుండిన కాలాలు చరిత్రలో ఇంకా ఎక్కువేనని చెప్పుకోవాలి. అయినప్పటికీ మనం మన తెలుగు జాతి అస్తిత్వాన్ని, వుద్యమాల్ని విశాలతర జాతీయోద్యమంలో పూర్తిగా లీనం చేసుకున్నాము. మనకు కొద్దిపాటి లౌక్యంవున్నా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని 1928లోనో, కాకున్నా 1937 లోనో తప్పకుండా సాధించివుండగలిగే వాళ్లమే. అలాంటప్పుడు మదరాసు నగరం మొత్తం గానీ, అందులో ముఖ్యమైన ఉత్తర భాగంగానీ మనకు తప్పక దక్కివుండేదే; బళ్లారి మొత్తంగా, హంపి, హోస్పేటలతో యుక్తంగా మనకు తప్పక దక్కివుండేది; అలాగే బరంపురంకూడా. కానీ అప్పుడుకూడ మన నాయకులు మొత్తం దేశంలో భాషాప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే కోరారు గాని, మన జాతిస్వార్థం ఒక్కటే చూచుకోలేదు. అందుకే 1936-37 ప్రాంతాల్లో ఒరిస్సా ఏర్పడినా, 1937 లో మదరాసు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానం చేసినా అప్పట్లోనే మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోలేక పోయాము. మన పోరాట శీలతకు, త్యాగాలకు గాంధీ ముగ్ధుడైనా, నెహ్రూ, పటేల్ లు మాత్రం స్వాతంత్ర్యానంతరం అడుగడుగునా అడ్డు తగులుతూ, మళ్లీ ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని జటిలం చేసారు. చివరకు ఎన్నో త్యాగాలతో, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి అమరత్వంతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. మళ్లీ విశాలాంధ్ర నిర్మాణానికి సైతం నెహ్రూ ఎన్నో అడ్డుకట్టలు వేసినా, చివరకు మనం పోరాడి సాధించుకున్నాం. మనం అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల ప్రజలు ఉభయులూ - ప్రధానంగా తెలంగాణాలోనే విశాలాంధ్ర వుద్యమం ఉధృతంగా సాగింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాతకూడ మనం ఎప్పుడూ విశాలతర భారత జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చాము.

కాని కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మనల్ని చిన్న చూపు చూస్తూనే వస్తూండినాయి. వాడుకుని పారవేసే [use and throw] వస్తువులుగానే చూస్తూ వచ్చాయి. NTR నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం, ఏర్పడ్డ 9 నెలలకాలంలో దాని ఘన విజయం కేవలం కాంగ్రెస్ దుష్పరిపాలనకు ప్రతిక్రియే కాక, తెలుగు జాతి అస్తిత్వ ప్రకటన, ఆత్మగౌరవ ప్రకటనగాకూడ జరిగింది. కాని మన జాతి ఐక్యత, చైతన్యాలను నప్పని కేంద్ర ప్రభుత్వాలు, మరి కొన్ని దుష్ట శక్తులు ఇక్కడ ప్రాంతీయతత్వాల విజృంభనకు కుట్రలు చేసారు; దోహదం చేసారు. ఉన్న విభేదాల్ని మరింతగా పెంచడానికి, సామరస్యానికి బదులు సంఘర్షణను నెలకొల్పడానికే కృషి చేసిన ఫలితమే నేటి ఈ దుస్థితి. కష్టపడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలుగు సమైక్య రాష్ట్రం కూలిపోతున్నది. ఒకప్పుడు ఐక్యతకోసం పెద్దయెత్తున వుద్యమించిన తెలంగాణా ప్రజల్లోనే ఎక్కువమందిలో ప్రాంతీయోన్మాదం నింపి తెలుగు జాతిని చీల్చివేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాకు late డాక్టరు మిత్రాగారు [అకూపంక్చరిస్ట్, భారత చైనా మిత్ర మండలి అధ్యక్షుడిగా వుండిన సాంఘిక కార్యకర్త ] గుర్తుకొస్తున్నారు. ఆయన 1990లలో స్వతంత్ర తెలుగు దేశ సాధనా సమితి లేక సంఘటన అని ఒకటి పెట్టి కొంతకాలం ఆ దిశగా కృషి చేసినట్లు గుర్తు. ఆయన కాళోజీగారితో తగువు పెట్టుకునే వాడు - మీరు ప్రత్యేక తెలంగాణా అంటున్నారు, నేను ప్రత్యేక స్వతంత్ర తెలుగు దేశం అంటున్నాను, అందులో తెలంగాణా ఒక రాష్ట్రంగా వుండొచ్చు గదా అని వాదిస్తూండే వాడు కూడ. సరే అది పుబ్బలో పుట్టి మఖలో మాడిన చందంగా జరిగిన ఒక చిన్న పరిణామమే. కాని కొన్ని ముఖ్యమైన రాజకీయ సూచనల్ని మిగిల్చి వెళ్లిన పరిణామం.

ఈ రోజు [లేక నిన్న అనాల్నేమో - 13-2-2014] సాయంత్రం TV 9 లో చర్చ సందర్భంగా ఒక తెలుగు దేశం నాయకుడు ఆవేశంలో చేసిన హెచ్చరిక, నలమోతు చక్రవర్తి విశాలాంధ్ర మహాసభ బ్లాగులో సూచనాత్మకంగా చేసిన హెచ్చరిక చూస్తే ఇదంతా గుర్తుకొచ్చింది. ఆ తెలుగు దేశం నేత చాల ఆవేశంగా ' శిక్కుల్ని అన్యాయం చేసినందుకు ఇందిరా గాంధీకి, తమిళుల్ని అన్యాయం చేసినందుకు రాజీవ్ గాంధీకి ఏమి దుర్గతి పట్టిందో అదే పరాభవం ఆంధ్రులకు అన్యాయం చేస్తున్న సోనియా గాంధీకి కూడ పట్టక తప్పదు ' అని హెచ్చరించాడు. అలాగే నలమోతు చక్రవర్తి [తెలంగాణావాసియైన తెలుగు జాతి ఐక్యతా వాది] కూడ తెలుగు జాతి స్వతంత్ర అస్తిత్వ తపన ఇకపై మరింత బలపడితే తప్పు కేంద్ర ప్రభుత్వానిదేనని నర్మగర్భంగా హెచ్చరించాడు. మరి ఇదంతా చూస్తే ఇకపై కనీసం సీమాంధ్ర ప్రాంతంలోనైనా తెలుగు జాతి స్వతంత్ర అస్తిత్వ వాదం బాగా బలపడుతుందేమో, ఇదివరలో భారత ఐక్యతకు ఎంతో దోహదం చేసిన అస్సాం వాసులు నేడు గణనీయంగా స్వతంత్ర రాజ్య సాధనా వుద్యమానికి ఎందుకు మద్దతిస్తున్నారో, ఈశాన్య రాష్ట్రాల్లో స్వతంత్ర రాజ్య స్థాపనా వుద్యమాలు ఎందుకు చెలరేగుతున్నాయో, అలాగే నేటి ఈ సోనియా గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాల దుశ్చర్యలవల్ల తెలుగు సీమలోనూ, అలాగే మెల్ల మెల్లగా అనేక ఇతర రాష్ట్రాల్లోనూ కూడ స్వతంత్ర జాతీయ రాజ్య సాధనా వుద్యమాలు పాదుకుని పోయి, విజృంభిస్తాయేమో, ఆవిధంగా నేటి రాష్ట్ర విభజనా దుశ్చర్య రేపు రేపు దేశమంతా ముక్కలు చెక్కలు కావడానికి దారి తీస్తుందేమో ననే భయాందోళనలు నాకు సహజంగానే కలుగుతున్నాయి కూడ. అయితే దీనికంతటికీ ముఖ్య కారణం దేశంలో సమాఖ్యా వ్యవస్థ, సమాఖ్యా స్ఫూర్తుల్ని తమ నీచ కుటిల స్వార్థ ప్రయోజనాలకోసం కుంగదీస్తున్న కేంద్ర ప్రభుత్వానిది, ముఖ్యంగా సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ముష్కరులది అని మాత్రం చెప్పకతప్పదు. అలాగే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు పేరిట కేంద్ర ప్రభుత్వ నిరంకుశ అధికారాల పెంపు దిశగా కృషి చేస్తూ, ముఖ్యంగా తెలుగు జాతిని చీల్చడానికి ఒక ముఖ్య భూమిక వహించిన భారతీయ జనతా పార్టీకూడ ఈ పాపంలో కొంత మూటకట్టుకోక తప్పదు.

No comments:

Post a Comment