Friday, November 11, 2016

శిఖండి పూర్వజన్మవృత్తాంతం

సుయోధనుని కోరికపై భీష్ముడు శిఖండి గురించి చెప్పసాగాడు " సుయోధనా ! నేను రాజ్యాధికారం వహించనని వివాహం చేసుకోనని మా తండ్రి వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేసాను. కనుక నా తండ్రి మరణానంతరం నా తమ్ముడు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేసాను. దుందుడుకు స్వభావం కలిగిన చిత్రాంగధుడు గంధర్వునితో తలపడి అతడి చేతిలో మరణించాడు. ఆ తరువాత విచిత్రవీర్యునికి రాజ్యాభిషేకం చేసాను. అతడికి వివాహ వయసు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు నేను అతడి కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకుని బలవంతంగా హస్థినాపురానికి తీసుకువచ్చాను. వారిని ముగ్గురిని విచిత్రవీర్యుని వివాహం చేసుకొమ్మని చెప్పాను. వారిలో అంబ అప్పటికే సాళ్వుని ప్రేమించి ఉంది ఆ విషయం తెలియని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు నాకూ ఆ విషయం తెలియకుండా ఆమెను హస్థినకు తీసుకు వెళ్ళాను. అంబ నాతో " మీరు ధర్మాత్ములు నేను మనసారా సాళ్వుని ప్రేమించాను కనుక మనసులేని మనువు చేసుకొనజాలను నన్ను సాళ్వుని వద్దకు పంపించు " అని అడిగింది.
నేను నా తప్పు గ్రహించి ఆమెను సాళ్వుని వద్దకు పంపాను కాని అతడు " భీష్ముడు నిన్ను బలవంతంగా తీసుకు వెళ్ళాడు కనుక నేను నీ కన్యాత్వాన్ని నమ్మజాలను కనుక తిరిగి అతని వద్దకే వెళ్ళు " అన్నాడు. ఆమె జరిగినది అంతా వివరించి సాళ్వుని ఎంత వేడినా ఫలితం శూన్యం. ఆమె ఇదంతా భీష్ముని వలనే జరిగిందని చింతించి అతనిపై ఎలాగైనా పగతీర్చు కోవాలని నిర్ణయించుకుని మహా వీరుడైన భీష్ముని జయించడానికి తపస్సు తప్ప మరే మార్గం లేదని గ్రహించి తపోభూమికి చేరుకుంది. అక్కడ ఉన్న మునులకు తనగాధ వివరించింది. వారు ఆమెకు తపస్సు స్త్రీలకు కఠినమని తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పారు. ఆమె వారితో " అయ్యా ! నేను ఇక నా తండ్రి వద్దకు కాని , బంధువుల వద్దకు గాని వెళ్ళలేను. కనుక ఇక్కడ తపస్సు చేసుకోవడమే నా నిర్ణయం " ఆ సమయంలో అక్కడకు వచ్చిన హోత్రవాహనుడు అనే రాజర్షి అక్కడకు వచ్చి అంబను గురించి తెలుసుకుని " అంబా ! నీవు నాకు వరసకు మనవరాలివి. నిష్కారణంగా శిక్షింపబడిన నీవు తపసు చేయడమెందుకు ? ఇందుకు నేను ఒక మార్గం చెప్తాను నీకు అపకారం చేసిన భీష్ముని గురువైన పరశురాముని వద్దకు వెళ్ళి సహాయం అడిగావంటే అతడు తన శిష్యుడైన భీష్మునికి చెప్తాడు అతని మాటను భీష్ముడు మీరజాలడు " అన్నాడు.
శ్హిష్యుడు చెప్పిన విధంగా పరశురాముడు హోత్రవాహనుడి ఇంటికి వచ్చాడు. హోత్రవాహనుడు పరశురాముని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించిన పిదప అంబ వృత్తాంతం వివరించాడు. పరశురాముడు అంబను చూసి " అంబా ! నీకు భీష్ముడు, సాళ్వుడు ఇద్దరూ అపకారం చేసారు. నేను ఎవరిని శిక్షించాలో నీవే విర్ణయించు " అన్నాడు. అంబ " మహాత్మా ! ఏది ఏమైనా సాళ్వుడు ఇక నన్ను స్వీకరించడు. కనుక భీష్ముని వద్దకు వెళ్ళి న్యాయం అడగాలి " అన్నది. పరశురాముడు అంబను వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చాడు. అతడు ముందుగా సరస్వతీ తీరాన విడిది చేసి నాకు వర్తమానం పంపాడు. నేను గురువుగారిని దర్శించి అర్గ్యపాద్యములు సమర్పించి సత్కరించాను. నా వినయ విధేయతలకు సంతోషించిన పరశురాముడు " గాంగేయా ! ఈ కన్యను బలవంతంగా ఎందుకు తెచ్చావు. వచ్చిన తరువాత తిరస్కరించడం ధర్మమా ! " అని అడిగాడు. నేను ఆమె ప్రేమవృత్తాంతం విని ఆమెను సాదరంగా సాళ్వుని వద్దకు పంపాను ఇందు నా అపరాధం ఏమున్నది " అన్నాను.
పరశురాముడు కోపించి అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయకున్న నిన్ను నీ బంధు మిత్రులను, పరి వారాన్ని నాశనం చేస్తాను " అన్నాడు. భీష్ముడు " నాకు విద్య నేర్పిన నీవే నా మీద కోపించడం తగునా ! " అన్నాను. పరశురాముడు " గాంగేయా ! నీవెన్ని చెప్పినా నీవు అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయనిదే నా కోపం తగ్గదు " అన్నాడు. నేను " గురువర్యా ! మీరు నన్ను అధర్మం చెయ్యడానికి పట్టుబడుతున్నారు. వేరొకరి మీద మనసు పడిన కన్యను నేను ఎలా నా తమ్మునికిచ్చి పరిణయం చేయగలను. ఇంతకన్నా మీ ఆగ్రహానికి గురి కావడమే మేలు. అధర్మానికి పురికొల్పే వాడు గురువైనా దండనార్హుడే అని పెద్దలు చెప్పారు కదా ! " అన్నాడు. పరశురాముడు ఆ మాటలకు కోపించి గాంగేయా ! యుద్ధానికి సిద్ధంగా ఉండు " అన్నాను నేను " గురువర్యా ! మీరు ఇదివరకే అహంకరించి క్షత్రియ వంశం నాశనం చేసారు. అప్పుడు భీష్ముడు లేడు ఇప్పుడు ఉన్నాడు. ఇక మీ ఆటలు సాగవు నేను యుద్ధం చేయ సిద్ధంగా ఉన్నాను " అన్నాను.
నేను నా తల్లి సత్యవతీదేవికి జరిగినది వివరించి ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యాను. నా తల్లి గంగాదేవి ఇది విని పరశురాముని చూసి నచ్చ చెప్పబోయింది ఆయన వినక పోవడంతో ప్రయోజనం లేదని ఆమె వెను తిరిగింది. అకృతవర్ణుని సారధ్యంలో పరశురాముడు యుద్ధభూమికి వచ్చాడు. నేను నా గురువుకు నమస్కరించి యుద్ధం ఆరంభించాను. పరశురాముడు నాపై శరవర్షం కురిపించాడు. నేను వాటిని అన్నిటినీ తుంచి పరశురాముని విల్లు విరిచాను అతడు మరో విల్లు తీసుకున్నాడు. నా బాణప్రయోగంతో అతని ఒళ్ళంతా తూట్లు చేసాను. అధిక రక్త స్రావం వలన పరశురాముడు మూర్చిల్లాడు. అతడిని చూసి నన్ను నేనే నిందించుకున్నాను. పరశురాముడు తేరుకుని నా పై అస్త్రం సంధించాడు. అది ఏమి అస్త్రమో నాకు తెలియదు అది నన్ను గాయపరిచింది సారధి నన్ను పక్కకు తీసుకు వెళ్ళాడు. ఇంతలో నేను తేరుకుని పరశురాముని బాణాలతో ముంచాను. ఈ విధంగా మేమిరువురము ఘోరంగా ఇరవై రెండు రోజులు యుద్ధం చేసాము.
చివరకు నేను పరశురామునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. దాని ప్రభావానికి పరశురాముడు మూర్చిల్లాడు. అక్కడి మునులంతా వ్యాకులపడ్డారు. మూర్ఛలో నుండి తేరుకుని అతడు నా సారధిని చంపి నన్ను బాణాలతో కొట్టాడు. ఆ ధాటికి నేను మూర్ఛిల్లాను. ఆ సమయంలో బ్రాహ్మణులు కొందరు నాకు సేవ చేసారు. నా తల్లి గంగాదేవి నా రథం నడిపింది. నేను మూర్ఛ నుండి తేరుకున్నతరు వాత నా తల్లి నాకు రథం అప్పగించి వెనుతిరిగింది. ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణులు కలలోకి వచ్చి భీష్మా మేము నీవు ఒక్కటే పరశురాముని జయించగల అస్త్రం ఇదొక్కటే అని నాకు మోహనాస్త్రం ఇచ్చారు. నేను దానిని ప్రయోగ ఉపసంహారాలతో అభ్యసించి యుద్ధానికి వెళ్ళాను. పరశురాముడు " నిన్న సగం చచ్చి వెళ్ళావు కదా ! ఈ రోజు నీ మదం అణచగలను రా అని నా పై అనేక బాణాలు సంధించాడు. నేను అతని పై శక్తి అస్త్రం ప్రయోగించాను. ఆ ప్రభావానికి అతడు మూర్ఛిల్లగా అకృతవర్ణుడు అతడిని మూర్ఛ నుండి తేరుకునేలా చేసాడు. ఆయన ఆగ్రహంతో నాపై బ్రహ్మాస్త ప్రయోగం చేసాడు. నేను ఆయన అస్త్రాన్ని అదే అస్త్రంతో నివారించాను. ఆ అస్త్రాలు లోకాల్లో విలయాన్ని సృష్టిస్తున్నాయి.
నేను అతడిపై మోహనాస్త్రాన్ని ఆవాహన చేసాను. ఇంతలో నారదుడు వచ్చి " గాంగేయా ! మోహనాస్త్రప్రయోగం నీకు ఉచితం కాదు అన్నాడు " అని వారించాడు. అష్ట వసువులు కూడా నన్ను వారించారు నేను వారి మాట విని బాణాన్ని ఉసంహారం చేసాను. పరశురాముని తండ్రి పితృ దేవతలతో వచ్చి " పరశురామా ! భీష్ముడు సామాన్యుడు కాదు అష్టవసువులలో అగ్రగణ్యుడు అతడిని గెలవడం ఎవరి తరం కాదు. నరనారాయణులలో ఒకరైన అర్జునుడు భీష్ముని సంహరించగల ధీరుడు . బ్రాహ్మణుడి వైన నీకు ఈ అనవసర యుద్ధం తగదు " అని జమదగ్ని చెప్పినా పరశురాముడు వినలేదు. నేను పట్టు వీడ లేదు. నా తల్లి గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది ఆమె చెప్పినా నేను విన లేదు. పలువురు పరిపరి విధాల మా ఇద్దరికి నచ్చ చెప్పి యుద్ధం మాన్పించారు.
బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి " గాంగేయా ! నీ గురువు అతి పరాక్రమ వంతుడు బ్రహ్మకోవిదుడు అయిన పరశురాముని వద్దకు వెళ్ళి నమస్కరించి క్షమాపణ అడిగి దీవెనలు అందుకో " అన్నారు. గంగాదేవి నారదునితో పరశురాముని వద్దకు వెళ్ళి " బార్గవరామా! దేవవ్రతుడు నీ శిష్యుడు అతడు ధర్మాన్ని విడువజాలక నీతో తలపడ్డాడు కాని నీపై విరోధం లేదు అతడిని దయతో మన్నించు " అని చెప్పారు. నేను పరశురామునికి నమస్కరించాను అతడు నన్ను మన్నించి నన్ను లేవనెత్తి వాత్సల్యంతో కౌగలించుకున్నాడు. అంబతో " అంబా ! చూసావు కదా ! నేను చేయగలిగినది చేసాను ఇక నీ దారి నువ్వు చూసుకో " అన్నాడు. అంబ " మహాత్మా ! మీకు వీలైనంత చేసారు. నేను తపమాచరించి నా పగ తీర్చుకుంటాను ఈ జన్మలో వీలు కాకున్న మరో జన్మలో తీర్చుకుంటాను " అని అక్కడ నుండి వెళ్ళి పోయింది.

No comments:

Post a Comment